రోడ్డు ప్రమాదంలో డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
రోడ్డు ప్రమాదంలో డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
జనగామ జిల్లా, జూన్ 14: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువ దంతవైద్యురాలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన శనివారం చోటుచేసుకుంది.
హనుమకొండ జిల్లా నయీంనగర్‌కు చెందిన మహ్మద్ రహముద్దీన్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగిలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఈ క్రమంలో గోవర్ధనగిరి దర్గా సమీపానికి చేరుకోగానే వారి కారు అదుపు తప్పి రహదారి పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో రహముద్దీన్ కుమార్తె హబీబా హఫ్సా (27), బంధువైన మహ్మద్ అసదుద్దీన్ (26) అక్కడికక్కడే మృతి చెందారు. హబీబా హఫ్సా కలబురిగిలో దంతవైద్యురాలిగా సేవలందిస్తుండగా, అసదుద్దీన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
అదే కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విషాద ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. యువ వయసులోనే ఇద్దరు ప్రతిభావంతులైన యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.

Post a Comment