మహిళల భద్రతే ప్రధాన లక్ష్యం: జిల్లా వ్యాప్తంగా గ్రామసభల ద్వారా అవగాహన కార్యక్రమాలు

మహిళల భద్రతే ప్రధాన లక్ష్యం: జిల్లా వ్యాప్తంగా గ్రామసభల ద్వారా అవగాహన కార్యక్రమాలు
 మహిళల భద్రతే ప్రధాన లక్ష్యం: జిల్లా వ్యాప్తంగా గ్రామసభల ద్వారా అవగాహన కార్యక్రమాలు

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 6: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో గ్రామసభలను నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమాలు సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగభూపాలెం, పాత అంజనాపురం, కొత్త అంజనాపురం, కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 4 ఇంక్లైన్, 3 ఇంక్లైన్, ప్రశాంతినగర్, జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండెపూడి, ఏడుల్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగిరెడ్డిపల్లి, పాత రెడ్డిపాలెం, అలాగే మణుగూరు మున్సిపాలిటీ మరియు భద్రాచలం గ్రామపంచాయతీలలో నిర్వహించారు.

గ్రామసభల్లో పోలీసు అధికారులు మహిళలు, యువత, గ్రామస్థులకు మహిళల భద్రతకు సంబంధించిన పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, మహిళలకు సంబంధించిన చట్టాలు మరియు వివిధ సెక్షన్లు, మహిళా సంక్షేమ పథకాలు, పోక్సో చట్టం (POCSO Act), షీ బాక్స్ (She Box) వినియోగం, టీ-సేఫ్ (T-Safe) యాప్ సేవలు, షీ టీమ్స్ మరియు భరోసా సెంటర్ పాత్ర గురించి వివరించారు.

అదేవిధంగా బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు, రోడ్డు భద్రత నియమాలు, మాదకద్రవ్యాల నిర్మూలన వంటి సామాజిక అంశాలపై ప్రజలకు సూచనలు చేశారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, అనుమానాస్పద ఘటనలు లేదా నేరాలకు సంబంధించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే హెల్ప్‌లైన్ నంబర్లపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళా భద్రత విభాగం హెల్ప్‌లైన్ 181, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, అత్యవసర సేవల నంబర్ 112 సేవలను అవసరమైన సమయంలో వినియోగించుకోవాలని సూచించారు.

ఈ అవగాహన కార్యక్రమాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు మహిళల భద్రతపై అవగాహన పెంచడంతో పాటు, సమాజంలో నేరాల నివారణకు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు.

Blogger ఆధారితం.