గృహప్రవేశ వేడుకలో రౌడీ మూకల బీభత్సం.. మహిళలు, చిన్నారులపై కర్రలు, రాళ్లతో దాడి

గృహప్రవేశ వేడుకలో రౌడీ మూకల బీభత్సం.. మహిళలు, చిన్నారులపై కర్రలు, రాళ్లతో దాడి

గృహప్రవేశ వేడుకలో రౌడీ మూకల బీభత్సం.. మహిళలు, చిన్నారులపై కర్రలు, రాళ్లతో దాడి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: బోడుప్పల్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఓ గృహప్రవేశ వేడుక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నూతనంగా నిర్మించిన ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా దాదాపు 40 నుంచి 50 మంది దుండుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడి బీభత్సం సృష్టించారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది.

సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి గృహప్రవేశ వేడుక నిర్వహిస్తున్న సమయంలో దుండుగుల గుంపు ఇంటి గేట్లను బద్దలు కొట్టి లోపలికి చొరబడ్డారు. అనంతరం మహిళలు, చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డు వచ్చిన వారిపైనా రాళ్లు రువ్వడంతో అక్కడ తీవ్ర భయాందోళన నెలకొంది.

ఈ దాడిలో వేడుకకు హాజరైన పలువురు బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాథమిక విచారణలో పాత కక్షలు, భూ వివాదాల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో దేవేందర్ నగర్ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.