లైసెన్స్ లేకుండా డ్రగ్స్ విక్రయం.. డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుడికి 3 ఏళ్ల జైలు

 

లైసెన్స్ లేకుండా డ్రగ్స్ విక్రయం.. డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుడికి 3 ఏళ్ల జైలు

లైసెన్స్ లేకుండా డ్రగ్స్ విక్రయం.. డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుడికి 3 ఏళ్ల జైలు

కొత్తగూడెం, జూలై 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లైసెన్స్ లేకుండా డ్రగ్స్ విక్రయించిన కేసులో డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుడికి కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది.

ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం, అశ్వారావుపేటకు చెందిన మార్త పెద్దిరాజు నిర్వహిస్తున్న సాగర్ డ్రగ్స్ సెంటర్‌పై 2015 మే 11న జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ జి. అశ్విని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చట్టబద్ధమైన లైసెన్స్ లేకుండానే డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం నేరమని భావించి కేసు నమోదు చేశారు.

దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, విచారణలో నలుగురు సాక్షులను పరిశీలించారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన దమ్మపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ డాక్టర్ బి. భవాని నిందితుడు మార్త పెద్దిరాజుపై అభియోగాలు రుజువయ్యాయని నిర్ధారించారు.

దీంతో నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రభుత్వ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హెచ్. శ్రీధర్ వాదనలు వినిపించారు.

Blogger ఆధారితం.