అవినీతి అధికారి మాస్టర్ ప్లాన్.. గోడల్లో నగదు, దేవుడి చిత్రాల వెనుక బంగారం.. రూ.300 కోట్ల ఆస్తుల కలకలం

అవినీతి అధికారి మాస్టర్ ప్లాన్.. గోడల్లో నగదు, దేవుడి చిత్రాల వెనుక బంగారం.. రూ.300 కోట్ల ఆస్తుల కలకలం

 అవినీతి అధికారి మాస్టర్ ప్లాన్.. గోడల్లో నగదు, దేవుడి చిత్రాల వెనుక బంగారం.. రూ.300 కోట్ల ఆస్తుల కలకలం

ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ అధికారి ఇంటిపై నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ/విజిలెన్స్) సోదాల్లో వెలుగుచూసిన విషయాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. రవాణా శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న లలిత్ కుమార్ నెలకు సుమారు రూ.80 వేల జీతం పొందుతున్నప్పటికీ, అతని వద్ద రూ.300 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

సోదాల సందర్భంగా అధికారులు ఇంట్లో అడుగడుగునా నగదు, బంగారం, ఆస్తుల పత్రాలను గుర్తించారు. గోడల మధ్య ప్రత్యేకంగా ఖాళీలు ఏర్పాటు చేసి వాటిలో ప్లాస్టిక్ డబ్బాల్లో నగదు కట్టలను దాచి, బయటకు ప్లాస్టర్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

అంతేకాకుండా సోఫాలను ప్రత్యేకంగా తయారు చేయించి, వాటి లోపల ఇనుప పెట్టెల్లో నగదు నిల్వ చేసినట్లు గుర్తించారు. ఇంట్లోని ఫాల్ సీలింగ్ పైన కూడా ప్లాస్టిక్ కవర్లలో నగదు కట్టలను దాచినట్లు అధికారులు తెలిపారు. పూజా గదిలో దేవుడి చిత్రాల వెనుక బంగారం బిస్కెట్లు దాచి ఉంచినట్లు, వంటగదిలో క్యాబినెట్లలో రహస్య అరలు ఏర్పాటు చేసి అందులో నగదు, బంగారం నిల్వ చేసినట్లు గుర్తించారు.

మూడు బెడ్‌రూమ్‌లలోని డబుల్ కాట్ బెడ్ల కింద ప్రత్యేక అరలు నిర్మించి, వాటిలో బంగారం బిస్కెట్లు, నగదు కట్టలు ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటి దాదాపు ప్రతి భాగాన్ని అక్రమ సంపద దాచుకునే విధంగా మార్చినట్లు విచారణలో తేలింది.

గోడల్లో నగదు ఎలా గుర్తించారని ప్రశ్నించగా, ఇంట్లో కొన్ని గోడలు అసాధారణంగా మందంగా ఉండటం, మరికొన్ని పలచగా కనిపించడంతో అనుమానం వచ్చిందని అధికారులు తెలిపారు. గంటల తరబడి విచారణ చేసినా సరైన సమాధానం రాకపోవడంతో గోడలను పగులగొట్టగా, లోపల భారీ మొత్తంలో నగదు బయటపడిందని వెల్లడించారు.

సోదాల్లో ఇప్పటివరకు సుమారు రూ.35 కోట్ల నగదు, 35 కిలోల బంగారం ఆభరణాలు, బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే బ్యాంకుల్లో భారీ మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు, 12 ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన పత్రాలు, నాలుగు లగ్జరీ అపార్ట్‌మెంట్ల వివరాలు కూడా బయటపడ్డాయి.

ప్రాథమిక అంచనాల ప్రకారం లలిత్ కుమార్‌కు చెందిన మొత్తం ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని, అక్రమ ఆస్తుల పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.