పొలానికి నీరు పెడుతుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి

 

పొలానికి నీరు పెడుతుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి

పొలానికి నీరు పెడుతుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి

నవీపేట్: వ్యవసాయ పొలానికి నీరు పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని నిజాంపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపూర్ గ్రామానికి చెందిన రైతు పల్లె లక్ష్మణ్ (42) శనివారం ఉదయం తన వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మోటారు స్టార్టర్‌కు విద్యుత్ వైర్ కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్ర విద్యుదాఘాతానికి గురైన లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న నవీపేట్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. మృతుడి భార్య పల్లె లింగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

మృతుడు లక్ష్మణ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న లక్ష్మణ్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, నిజాంపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రైతు మృతిపై గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.