రాష్ట్రవ్యాప్తంగా 47 దేవాలయాలకు 191 మంది సిబ్బందికి నియామక ఉత్తర్వులు అందజేత
రాష్ట్రవ్యాప్తంగా 47 దేవాలయాలకు 191 మంది సిబ్బందికి నియామక ఉత్తర్వులు అందజేత
హైదరాబాద్, జూలై 17: తెలంగాణ దేవాదాయ శాఖ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచే కార్యక్రమం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా శుక్రవారం జరిగింది. రాష్ట్రంలోని 47 దేవాలయాలకు చెందిన అర్చకులు, వేదపండితులు, పరిచారకులు, వాయిద్య కళాకారులు, ఇతర మతపరమైన విభాగాలకు చెందిన మొత్తం 191 మంది ఉద్యోగులకు రాష్ట్ర దేవాదాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ నియామక ఉత్తర్వులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, దేవాలయ సేవ అనేది కేవలం ఉద్యోగం కాదని, భగవంతునికి సేవ చేసే పవిత్రమైన బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, దేవాదాయ శాఖ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఉద్యోగుల పనితీరును ప్రోత్సహించేలా ప్రతిభ ఆధారంగా ప్రత్యేక అవార్డులు కూడా అందజేస్తామని మంత్రి వెల్లడించారు.
ఎన్నో సంవత్సరాలుగా నియామకాల కోసం ఎదురుచూసిన అభ్యర్థులకు ఈ అవకాశం లభించడం పట్ల కొత్తగా నియామకాలు పొందిన ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు కల్పించిన అవకాశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, వివిధ దేవాలయాల ప్రతినిధులు, వేదపండితులు, అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Post a Comment