కన్నవారి కంట కన్నీరు పెట్టొద్దు.. తల్లిదండ్రుల సేవలోనే జీవిత సాఫల్యం: షేక్ అబ్దుల్ బాసిత్

 

కన్నవారి కంట కన్నీరు పెట్టొద్దు.. తల్లిదండ్రుల సేవలోనే జీవిత సాఫల్యం: షేక్ అబ్దుల్ బాసిత్

కన్నవారి కంట కన్నీరు పెట్టొద్దు.. తల్లిదండ్రుల సేవలోనే జీవిత సాఫల్యం: షేక్ అబ్దుల్ బాసిత్

హైదరాబాద్: తల్లిదండ్రుల సేవలోనే మనిషి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం దాగి ఉన్నాయని జమాతే ఇస్లామి హింద్ సభ్యులు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. పవిత్ర శుక్రవారం సందర్భంగా మెదరబస్తి గణేష్ టెంపుల్ పరిధిలోని మస్జిద్-ఎ-వహీద్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనిషి జీవితానికి మూలాధారమైన తల్లిదండ్రులను గౌరవించడం, వారి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధనల ప్రకారం తల్లిదండ్రుల సేవ వల్ల ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయని పేర్కొన్నారు.

తమ సంతానం భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడుతూ సర్వస్వం త్యాగం చేసే తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, కృతజ్ఞతతో వ్యవహరించాలని ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఆదేశించాడని తెలిపారు. ముఖ్యంగా వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారితో అసహనం ప్రదర్శించకూడదని, "ఉఫ్" అనే చిన్న మాట కూడా అనకూడదని ఖుర్‌ఆన్ బోధిస్తోందని గుర్తు చేశారు. చిన్నతనంలో తల్లిదండ్రులు చూపిన ప్రేమ, వాత్సల్యాన్ని సంతానం కూడా వారికి తిరిగి అందించాలని కోరారు.

మన తల్లిదండ్రులతో పాటు ఇతరుల తల్లిదండ్రులను కూడా గౌరవించడం నిజమైన ఆరాధనలో భాగమని ఆయన అన్నారు. ఆధ్యాత్మికత అంటే కేవలం నమాజ్, రోజా, హజ్ వంటి ఆరాధనలు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, సమాజంలోని ప్రతి ఒక్కరితో మంచిగా ప్రవర్తించడం కూడా పుణ్యాన్ని అందించే మార్గమని వివరించారు.

ప్రతి మతం తల్లిదండ్రులను గౌరవించాలని బోధిస్తుందని పేర్కొంటూ, తండ్రి మాట నిలబెట్టుకోవడానికి 14 సంవత్సరాలు రాజ్యాన్ని విడిచి వనవాసానికి వెళ్లిన శ్రీరాముడి ఆదర్శాన్ని, అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోసుకుని తీర్థయాత్రలు చేయించిన శ్రావణ కుమారుడి త్యాగాన్ని ఉదాహరణగా వివరించారు.

"తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది, తండ్రి సంతోషంలోనే దేవుని సంతోషం దాగి ఉంది" అని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. కన్నవారి కంట కన్నీరు పెట్టకుండా, వారి సేవను జీవిత ధ్యేయంగా భావించి వారి ఋణం తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షేక్ అబ్దుల్ బాసిత్ సూచించారు.

Blogger ఆధారితం.