మహిళా ఆత్మహత్య కేసులో ఆరుగురికి మూడేళ్ల జైలు శిక్ష.. రూ.2 వేల జరిమానా

 

మహిళా ఆత్మహత్య కేసులో ఆరుగురికి మూడేళ్ల జైలు శిక్ష.. రూ.2 వేల జరిమానా

మహిళా ఆత్మహత్య కేసులో ఆరుగురికి మూడేళ్ల జైలు శిక్ష.. రూ.2 వేల జరిమానా

కొత్తగూడెం, జూలై 17: మహిళ ఆత్మహత్యకు దారితీసిన కేసులో ఆరుగురు నిందితులకు కొత్తగూడెం అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు మూడేళ్ల చొప్పున జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధించింది. ఈ మేరకు అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కవిత కర్నాటి శుక్రవారం తీర్పు వెలువరించారు.

కేసు వివరాలు

2010 డిసెంబర్ 16న అప్పటి కొత్తగూడెం మండలం శెట్టిపల్లె గ్రామానికి చెందిన జల్లారపు లక్ష్మణ్‌రావు భార్య సత్యవతిపై అదే గ్రామానికి చెందిన బంధువులు జల్లారపు నాగేశ్వరరావు, పద్మ, రవికుమార్, నవ్య, మల్లికార్జున్, కుమారిలు ఆమెకు మంత్రాలు వస్తున్నాయంటూ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. బొడ్రాయి వద్ద ప్రమాణం చేయాలని ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన సత్యవతి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

అయితే, ఆమెను వదిలిపెట్టకుండా నాగేశ్వరరావు, రవికుమార్‌లు చేతులతో కొట్టి కిందపడేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం సత్యవతిని కొత్తగూడెంలోని డాక్టర్ నాగరాజు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ 2010 డిసెంబర్ 18న మృతి చెందింది.

ఈ ఘటనపై కొత్తగూడెం మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటి ఇన్‌స్పెక్టర్ బి. అశోక్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కేసును ముగించారు. అనంతరం బాధిత కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది అరికల రవికుమార్ ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయగా, కోర్టు కేసును స్వీకరించి విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా 10 మంది సాక్షులను కోర్టు పరిశీలించింది. నిందితులపై అభియోగాలు రుజువయ్యాయని నిర్ధారించిన న్యాయస్థానం ఆరుగురికి ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు వాదనలు వినిపించారు. కోర్టు నోడల్ అధికారి జి. రాఘవయ్య, కోర్టు లైజాన్ అధికారి ఎం. శ్రీనివాస్ (కోర్టు డ్యూటీ ఆఫీసర్), పీసీ జి. హేమ్‌లాల్ తదితరులు సహకరించారు.

Blogger ఆధారితం.