మాతా శిశు ఆసుపత్రిలో ఘటనపై ప్రభుత్వాన్ని తప్పుబట్టిన బీఆర్ఎస్ నేత కాపు సీతాలక్ష్మి
మాతా శిశు ఆసుపత్రిలో ఘటనపై ప్రభుత్వాన్ని తప్పుబట్టిన బీఆర్ఎస్ నేత కాపు సీతాలక్ష్మి
కొత్తగూడెం, జూలై 16: కొత్తగూడెం ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో నిండు గర్భిణీ నిల్చున్న స్థితిలో ప్రసవించిన ఘటనపై బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఆసుపత్రిని సందర్శించిన ఆమె, బాధిత గర్భిణీని పరామర్శించి శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గర్భిణీలకు అత్యవసర సమయంలో వైద్యులు స్పందించకపోవడం క్షమించరానిదని అన్నారు. నొప్పులతో బాధపడుతున్న మహిళకు సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య సేవలు క్షీణించాయని, ఆసుపత్రుల్లో మందుల కొరత, వైద్యుల లేమి, అవసరమైన సౌకర్యాల కొరత తీవ్రంగా ఉందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్, హరీశ్‌రావు నాయకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
ఆసుపత్రికి వచ్చిన మహిళలు కూడా ప్రస్తుతం మందులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని తమకు ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన పలు సౌకర్యాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు.
జిల్లా కలెక్టర్ వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి, వైద్య సేవలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment