సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులపై పెనాల్టీల భారం.. CMPF, వైద్య సదుపాయాలు కల్పించాలని హెచ్‌ఎంఎస్ డిమాండ్
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులపై పెనాల్టీల భారం.. CMPF, వైద్య సదుపాయాలు కల్పించాలని హెచ్‌ఎంఎస్ డిమాండ్
గోదావరిఖని: సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులపై యాజమాన్యం సవతి తల్లి ప్రేమ చూపుతోందని హెచ్‌ఎంఎస్ కేంద్ర కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికులపై విధిస్తున్న పెనాల్టీ విధానాన్ని వెంటనే రద్దు చేయడంతో పాటు CMPF, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, చెల్లింపు సెలవులు, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ కార్మికుడు అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజరైనా రోజుకు రూ.300 చొప్పున పెనాల్టీ విధించడం అమానుషమని పేర్కొన్నారు. ఈ విధానాన్ని సింగరేణి యాజమాన్యం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.
సింగిల్ మెన్ టెండర్ కింద స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీలు, పార్కులు, ఆస్పత్రులు తదితర విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులపై ఈ పెనాల్టీ విధానం అమలు చేయడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారికి కనీస వేతనాలు, చెల్లింపు సెలవులు అమలు చేయడంతో పాటు పెనాల్టీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కోల్ ఇండియాలో కుదిరిన ఒప్పందం ప్రకారం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మొదటి కేటగిరీ వేతనం అమలు చేస్తామని చెప్పి 13 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు.
ఇప్పటికైనా మొదటి కేటగిరీ వేతనాన్ని అమలు చేసి, క్యాజువల్ లీవులు మంజూరు చేయడంతో పాటు కార్మికుల కుటుంబ సభ్యులకు సింగరేణి ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు కల్పించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు CMPF సౌకర్యాన్ని వర్తింపజేయాలని సింగరేణి సీఎండీని హెచ్‌ఎంఎస్ కేంద్ర కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ కోరారు.

Post a Comment