సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు.. హెచ్ఎంఎస్–తెలంగాణ రక్షణ సేన ఉద్యమ విజయమే: కల్వకుంట్ల కవిత

 

సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు.. హెచ్ఎంఎస్–తెలంగాణ రక్షణ సేన ఉద్యమ విజయమే: కల్వకుంట్ల కవిత

సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు.. హెచ్ఎంఎస్–తెలంగాణ రక్షణ సేన ఉద్యమ విజయమే: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ సింగరేణి సంస్థలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన సంయుక్తంగా చేపట్టిన గాంధేయ మార్గ పోరాటానికి ఫలితం దక్కిందని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నెలల తరబడి మెడికల్ బోర్డు ఏర్పాటు విషయంలో కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం చివరకు ఉద్యమానికి తలొగ్గి ఈ నెల 17, 18 తేదీల్లో మెడికల్ బోర్డు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం వేలాది మంది సింగరేణి కార్మికుల విజయమని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలతో మెడికల్ అన్‌ఫిట్ కోసం వేలాది మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నెలల తరబడి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా వారి మనోవేదనకు కారణమైందని విమర్శించారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరించిన ప్రభుత్వం, ఉద్యమం ఉద్ధృతం కావడంతోనే నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.

మెడికల్ బోర్డు ఏర్పాటు చేయడం ఒక్కసారికే పరిమితం కాకుండా ప్రతి నెలా క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో కార్మికుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు అని కవిత స్పష్టం చేశారు. మెడికల్ బోర్డు ద్వారా అన్‌ఫిట్‌గా ప్రకటించబడిన కార్మికులు సూచించే కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన కార్మికులందరి దరఖాస్తులను సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.

మెడికల్ బోర్డు ఏర్పాటు నిర్ణయం కార్మికుల ఐక్య పోరాటానికి లభించిన విజయమని, ఇకపై కూడా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.