గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా భారీ పేలుడు.. ఐదుగురికి తీవ్ర గాయాలు
గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా భారీ పేలుడు.. ఐదుగురికి తీవ్ర గాయాలు
మెదక్, జూలై 15: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని పరికిబండ గ్రామంలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా భారీ పేలుడు సంభవించి ఐదుగురు వలస కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్‌లోకి అక్రమంగా గ్యాస్ నింపే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
పేలుడు ధాటికి గదిలో ఉన్న సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. భారీ శబ్దంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ ప్రమాదంలో బీహార్‌కు చెందిన రాజేష్, గంగారాం, సంజీవ్, లాలాన్, దబల్ నాథ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనను తొలుత వంట చేస్తుండగా గ్యాస్ పేలిందని చెప్పి దాచిపెట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే బుధవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అసలు విషయం వెలికితీశారు.
ప్రాథమిక దర్యాప్తులో గత ఏడాది కాలంగా అద్దె ఇంటిలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ వ్యవహారంలో మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

Post a Comment