తెలంగాణలో SIR గడువు పొడిగింపు.. ఆగస్టు 3 వరకు అవకాశం

 

తెలంగాణలో SIR గడువు పొడిగింపు.. ఆగస్టు 3 వరకు అవకాశం

తెలంగాణలో SIR గడువు పొడిగింపు.. ఆగస్టు 3 వరకు అవకాశం

తెలంగాణలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న SIR కార్యక్రమానికి గడువును ఆగస్టు 3, 2026 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) చేసిన విజ్ఞప్తితో పాటు వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. అయితే కొంతమంది ఓటర్లకు ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోవడం, మరికొందరు ఫారాలను సమర్పించేందుకు అదనపు సమయం కోరడం వంటి అంశాల నేపథ్యంలో గడువు పొడిగించాలని రాజకీయ పార్టీలు, అధికారులు ఎన్నికల సంఘాన్ని కోరారు. 

గడువు పొడిగింపుతో ఇప్పటివరకు ఫారాలు సమర్పించని ఓటర్లకు మరో అవకాశం లభించింది. ఓటర్లు తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు ఉంటే సంబంధిత బూత్ లెవల్ అధికారులకు లేదా ఎన్నికల అధికారులకు నిర్ణీత గడువులోపు సమర్పించాలని ఎన్నికల అధికారులు సూచించారు.

ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం సవరించిన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసి, అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించిన తర్వాత తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 

Blogger ఆధారితం.