కొత్తగూడెం జిల్లా కోర్టులో డిస్పెన్సరీ ప్రారంభం.. నూతన కోర్టుల ఏర్పాటుకు కృషి చేస్తా: జస్టిస్ శ్రీనివాసరావు
కొత్తగూడెం జిల్లా కోర్టులో డిస్పెన్సరీ ప్రారంభం.. నూతన కోర్టుల ఏర్పాటుకు కృషి చేస్తా: జస్టిస్ శ్రీనివాసరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీ (ప్రథమ చికిత్స కేంద్రం)ను జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యం బాగుంటేనే విధులను సమర్థవంతంగా నిర్వహించగలరని అన్నారు. కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, న్యాయస్థానానికి వచ్చే ప్రజలకు ఈ ప్రథమ చికిత్స కేంద్రం అందుబాటులో ఉండటం ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం న్యాయవాదుల మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో జస్టిస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, కొత్తగూడెం కోర్టుకు అవసరమైన ఫ్యామిలీ కోర్టు, ఎక్సైజ్ కోర్టు, లేబర్ కోర్టు తదితర నూతన కోర్టుల ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా అవసరమైన ఏర్పాట్లను ముందుండి సమన్వయం చేస్తానని తెలిపారు. అలాగే కోర్టుల్లో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానన్నారు.
ఈ సందర్భంగా దమ్మపేట, భద్రాచలం, మణుగూరు, ఇల్లందు ప్రాంతాల నుంచి వచ్చిన న్యాయవాదుల సంఘాల ప్రతినిధులు జస్టిస్ శ్రీనివాసరావును కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్ ముధల్కర్, ప్రధాన కార్యదర్శి మహేష్ గడిపెళ్లి, కార్యవర్గ సభ్యులు కె. సంజీవరావు, జి. నాగరాజు, దేవదాస్, సంధ్యారాణి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా వ్యాప్తంగా వచ్చిన న్యాయాధికారులతో జస్టిస్ శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించి న్యాయస్థానాల పనితీరు, మౌలిక సదుపాయాలపై చర్చించారు.

Post a Comment