ప్రాపర్టీ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
ప్రాపర్టీ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ వార్షికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ, పెండింగ్ కేసుల పురోగతి, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమీక్షించారు.
ప్రత్యేకంగా ప్రాపర్టీ కేసుల దర్యాప్తుపై దృష్టి సారించాలని, దొంగతనాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన ఛేదించి, పోయిన ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం లేకుండా చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.
అలాగే జిల్లాలోని రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని, వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన నిఘా ఉంచి, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్లలో సీసీటీఎన్‌ఎస్ (Crime and Criminal Tracking Network & Systems) 2.0లో నమోదయ్యే కేసుల వివరాలను సకాలంలో, ఖచ్చితంగా నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. డిజిటల్ రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని తెలిపారు.
తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, మాల్ఖానా, ఆయుధాల నిర్వహణ, స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఇతర పరిపాలనా అంశాలను కూడా ఎస్పీ పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు.

Post a Comment