యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం: జిల్లా కలెక్టర్ అంకిత్

 

జిల్లాలోని 25 ఎన్‌సీసీ యూనిట్లకు రూ.9 లక్షల విలువైన శిక్షణ సామగ్రి పంపిణీ

యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం: జిల్లా కలెక్టర్ అంకిత్

జిల్లాలోని 25 ఎన్‌సీసీ యూనిట్లకు రూ.9 లక్షల విలువైన శిక్షణ సామగ్రి పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువతలో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించి వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల ద్వారా జిల్లాలోని ఎన్‌సీసీ యూనిట్లకు అందించిన శిక్షణ సామగ్రి విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

గురువారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో Esscientia Advanced Sciences Private Limited సంస్థ తమ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా జిల్లాలోని 25 ఎన్‌సీసీ యూనిట్లకు రూ.9 లక్షల విలువైన శిక్షణ సామగ్రిని అందజేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ శిక్షణ సామగ్రిని ఎన్‌సీసీ యూనిట్లకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్‌సీసీ విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సమయపాలన, నాయకత్వ నైపుణ్యాలు, జాతీయ సమైక్యత భావన, సేవా దృక్పథం వంటి విలువలను పెంపొందిస్తుందని తెలిపారు. వ్యక్తిత్వ వికాసం, శారీరక దృఢత్వం, సామాజిక బాధ్యత, దేశసేవ పట్ల అంకితభావాన్ని పెంచడంలో ఎన్‌సీసీ శిక్షణ విశేషంగా దోహదపడుతుందని చెప్పారు. ఎన్‌సీసీ ద్వారా తీర్చిదిద్దబడిన యువత భవిష్యత్తులో వివిధ రంగాల్లో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు, రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, స్వచ్ఛత కార్యక్రమాలు వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు ముందుండి సేవలందించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. జట్టు భావన, క్రమశిక్షణ, సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఎన్‌సీసీ అత్యుత్తమ వేదికగా నిలుస్తోందని అన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు కార్పొరేట్ సంస్థలు తమ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా సహకరించడం సంతోషకరమని కలెక్టర్ తెలిపారు. ఈ శిక్షణ సామగ్రి ఎన్‌సీసీ క్యాడెట్ల శిక్షణా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి శిక్షణా శిబిరాలు, రిపబ్లిక్ డే క్యాంపులు, ఇతర పోటీల్లో వారు మెరుగైన ప్రతిభ కనబర్చేందుకు దోహదపడుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 25 ఎన్‌సీసీ యూనిట్లకు 190 డమ్మీ గన్స్, 130 కంపాస్‌లు, 130 సర్వీస్ ప్రొట్రాక్టర్లు, 190 ఎన్‌సీసీ హ్యాండ్‌బుక్స్, 100 పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి, 11 తెలంగాణ బెటాలియన్‌కు చెందిన ఎన్‌సీసీ అధికారులు, జిల్లాలోని 25 ఎన్‌సీసీ యూనిట్ల అసోసియేట్ ఎన్‌సీసీ అధికారులు (ఏఎన్‌ఓలు), 120 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, 7 డిగ్రీ కళాశాలలు, 18 పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.