మహిళా సంఘాలకు త్వరలో ఫెర్టిలైజర్ లైసెన్సులు.. గ్రామాల్లోనే రైతులకు ఎరువుల పంపిణీ!

మహిళా సంఘాలకు త్వరలో ఫెర్టిలైజర్ లైసెన్సులు.. గ్రామాల్లోనే రైతులకు ఎరువుల పంపిణీ!
 మహిళా సంఘాలకు త్వరలో ఫెర్టిలైజర్ లైసెన్సులు.. గ్రామాల్లోనే రైతులకు ఎరువుల పంపిణీ!

హైదరాబాద్, జులై 9: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎరువులను గ్రామస్థాయిలోనే సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) ఫెర్టిలైజర్ లైసెన్సులు మంజూరు చేసి, వారి ద్వారా ఎరువుల పంపిణీ చేపట్టే ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో చురుకుగా పనిచేస్తున్న మహిళా సంఘాలను గుర్తించి, ఎంపిక చేసిన సంఘాలకు ఫెర్టిలైజర్ విక్రయ లైసెన్సులు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.67 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలు ఉండగా, వీటిలో అర్హత కలిగిన సంఘాలను ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నారు.

ఎరువుల పంపిణీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎంపికైన మహిళా సంఘాల సభ్యులకు యూరియా యాప్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కూడా అందించనున్నారు. దీంతో ఎరువుల విక్రయాలు పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.

అదేవిధంగా మహిళా సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 8,126 సొంత భవనాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ భవనాల్లోనే ఎరువులను నిల్వ చేసి, గ్రామ స్థాయిలోనే రైతులకు విక్రయించేలా ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ విధానం అమల్లోకి వస్తే రైతులు ఎరువుల కోసం పట్టణాలు లేదా మండల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ గ్రామంలోనే సులభంగా కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత బలోపేతం కానుందని అధికారులు భావిస్తున్నారు

Blogger ఆధారితం.