స్వర్గీయ ఎస్.కే. మసూద్‌కు ఘన నివాళులు.. పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖుల సంతాపం
స్వర్గీయ ఎస్.కే. మసూద్‌కు ఘన నివాళులు.. పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖుల సంతాపం
హృద్రోగంతో అకాల మరణం చెందిన కొత్తగూడెం పట్టణ మాజీ 22వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, ప్రముఖ మైనార్టీ నాయకుడు, స్నేహశీలి ఎస్.కే. మసూద్‌కు పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. గణేష్ టెంపుల్ సమీపంలోని ఆయన స్వగృహంలో ఉంచిన పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, కవి, సినీ గీత రచయిత, గాయకుడు, సమాజసేవకుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నివాళులర్పించారు. మాజీ మంత్రి స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు వద్ద వ్యక్తిగత సహాయకుడిగా (పీఏ) పనిచేసిన రోజుల నుంచి ఎస్.కే. మసూద్‌తో తనకు ఎంతో సన్నిహిత అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు.
మసూద్ మరణం సమాజానికి తీరని లోటని, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
నివాళులర్పించిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని), కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బచావత్ సంవిధాన్ నాయకుడు అర్జునరావు, మున్సిపల్ కార్పొరేటర్లు రావి రాంబాబు, హరిహర యాదవ్, సామాజిక సేవా ఆర్గనైజర్ అన్వర్ భాయ్, దళిత మైనారిటీ నాయకులు గుండా రమేష్, సల్మాన్ తోత్, పూర్వ తెలుగుదేశం నాయకులు సుక్కా సురేష్, బుగుల రవి, దుర్జన్ బస్తి రవి తదితరులు పాల్గొన్నారు.
మసూద్ మరణవార్త తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి హుటాహుటిన చేరుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా, రాష్ట్ర మైనారిటీ నాయకుడు నయీమ్ కురేషి, మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి, సీనియర్ అడ్వకేట్ ఎం.ఏ. రజాక్, సభ్యుడు సఫ్ధర్ బేగ్ పాషా తదితరులు పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
స్వర్గీయ ఎస్.కే. మసూద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Post a Comment