సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ మహాధర్నా.. వేలాదిగా తరలిరావాలి
సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ మహాధర్నా.. వేలాదిగా తరలిరావాలి
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 19: పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు వేలాదిగా తరలిరావాలని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం (TSGREA) రాష్ట్ర అధ్యక్షుడు పి. వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామా టాకీస్ రోడ్డులో ఉన్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా కార్యాలయంలో పెన్షనర్స్ గెట్ టుగెదర్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెన్షనర్లకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన అన్ని బెనిఫిట్స్‌ను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేకమంది మానసిక ఆందోళనకు గురవుతున్నారని విమర్శించారు.
హెల్త్ కార్డుల సమస్యను పరిష్కరించాలి
హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యంతో రిటైర్డ్ ఉద్యోగులు సరైన వైద్య సేవలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెన్షనర్లు హెల్త్ కార్డుల ద్వారా వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. హెల్త్ కార్డులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పెన్షనర్లకు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
జిల్లా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు EGR వెస్లీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. వెంకటేశ్వర్లు, రాష్ట్ర బాధ్యులు KSC చౌదరి, Y. వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు M. సుబ్బయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని మండల యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment