బాలికను వేధించిన నిందితుడికి మూడేళ్ల జైలు.. రూ.20 వేల జరిమానా
బాలికను వేధించిన నిందితుడికి మూడేళ్ల జైలు.. రూ.20 వేల జరిమానా
మెదక్ జిల్లా శివ్వంపేటలో బాలికను వేధిస్తూ, అసభ్యకరమైన చిత్రాలు పంపాలని కోరడంతోపాటు బెదిరింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది.
తూప్రాన్ సర్కిల్ పరిధిలోని శివ్వంపేటకు చెందిన దాసరి స్వామి (26) తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఫోన్ నంబర్‌ను ఆమె స్నేహితుల ద్వారా తీసుకుని తరచూ ఫోన్ చేస్తూ వేధించేవాడు. పాఠశాల వద్దకు వస్తానని, తనను కలవాలని ఒత్తిడి చేసేవాడు. బాలిక నిరాకరించడంతో పెట్రోల్ పోసుకుని చనిపోతానంటూ బెదిరించాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో ఇకపై ఆమె జోలికి వెళ్లనని నిందితుడు అప్పట్లో రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు.
అయితే రెండేళ్ల తర్వాత వేసవి సెలవుల్లో మళ్లీ బాలికను వాట్సాప్ ద్వారా సంప్రదించాడు. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన, నగ్న చిత్రాలు పంపాలని కోరుతూ వేధింపులకు పాల్పడ్డాడు. 2024 మే 24న బాలిక తండ్రికి ఫోన్ చేసి తన కుమార్తెను ఇంటి నుంచి పంపాలని, లేదంటే ఆమె మేజర్ అయిన తర్వాత తీసుకెళ్తానంటూ బెదిరించాడు.
దీంతో బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శివ్వంపేట పోలీసులు అప్పటి ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి వ్యతిరేకంగా అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించారు.
సాక్ష్యాధారాలను పరిశీలించిన మెదక్ జిల్లా ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావాలి నిందితుడు దాసరి స్వామికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
కేసు దర్యాప్తు, కోర్టు వ్యవహారాల్లో కోర్టు లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కృష్ణగౌడ్, సీడీఓ ఆనంద్ సహకరించారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా కృషి చేసిన పోలీసు సిబ్బందిని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ అభినందించారు.

Post a Comment