తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్ మధ్యలో పిడుగు.. 24 ఏళ్ల యువ ఆటగాడు మృతి
తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్ మధ్యలో పిడుగు.. 24 ఏళ్ల యువ ఆటగాడు మృతి
థాయిలాండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న విషాదకర ఘటన క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానికంగా నిర్వహిస్తున్న గోలోక్ ఎఫ్‌ఏ కప్ టోర్నీలో భాగంగా సుంగై గోలోక్‌లోని శాంతిపాప్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పిడుగు పడటంతో 24 ఏళ్ల యువ ఫుట్‌బాలర్ ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది ఆటగాళ్లు గాయపడ్డారు.
స్థానిక సమాచారం ప్రకారం, సామ్ కోల్ట్స్ మరియు అబు x నాంగ్ సిరిన్ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు మైదానంపై పడింది. ఈ ఘటనలో సామ్ కోల్ట్స్ జట్టుకు చెందిన యువ వింగర్ సొఫ్వాన్ అవాయే (24) తీవ్రంగా గాయపడి మైదానంలోనే కుప్పకూలిపోయాడు.
పిడుగు పడిన వెంటనే అతని సహచర ఆటగాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చి సీపీఆర్ (CPR) అందిస్తూ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం అత్యవసర వైద్య సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ అవాయే మృతి చెందినట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన 12 మంది ఆటగాళ్లలో ఒక మలేషియా ఫుట్‌బాలర్ కూడా ఉన్నట్లు స్థానిక పోలీస్ చీఫ్ తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరణించిన సొఫ్వాన్ అవాయే ఇటీవలే థాయ్ థర్డ్-టియర్ ఫుట్‌బాల్ క్లబ్ యాలా ఎఫ్‌సీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతని ఆకస్మిక మరణంపై క్లబ్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
ఇదిలా ఉండగా, థాయిలాండ్‌లో పిడుగుపాట్ల కారణంగా ప్రాణనష్టం చోటుచేసుకోవడం కొత్త విషయం కాదని అధికారులు పేర్కొంటున్నారు. అక్కడి డిసీజ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం, 2020 నుంచి 2024 వరకు దేశవ్యాప్తంగా 283 మంది పిడుగుపాటుకు గురయ్యారు, వీరిలో చాలామంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కాగా, ఇదే రోజున భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలో కూడా పిడుగులు పడి పొలాల్లో పనిచేస్తున్న 14 మంది వ్యవసాయ కూలీలు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మరింత పెంచింది.

Post a Comment