యువకుల వీరంగం.. హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని కత్తితో బెదిరింపు
శ్రీకాళహస్తిలో యువకుల వీరంగం.. హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని కత్తితో బెదిరింపు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఇద్దరు యువకులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని దాడికి ప్రయత్నించడమే కాకుండా.. కత్తితో బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు డయల్-100కు సమాచారం అందడంతో శ్రీకాళహస్తి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రమణయ్య ఘటనాస్థలానికి వెళ్లారు. అదే సమయంలో రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు యువకులు గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన బైక్ తాళాలను హెడ్ కానిస్టేబుల్ తీసుకోవడంతో యువకులు ఆగ్రహానికి గురయ్యారు.
శ్రీకాళహస్తి కొండమిట్టకు చెందిన జితేంద్ర, శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ రమణయ్యతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆయన కాలర్ పట్టుకుని దాడికి ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా కత్తిని బయటకు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారిపై దౌర్జన్యానికి దిగడంతో పోలీసులు వెంటనే స్పందించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
హెడ్ కానిస్టేబుల్ రమణయ్య ఫిర్యాదు మేరకు జితేంద్ర, శ్రీనివాస్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి ఎదుట హాజరుపరిచారు. విచారణలో శ్రీనివాస్‌పై గతంలోనూ ఓ కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ వైరల్ కావాలనే ఉద్దేశంతోనే నిందితులు ఆన్‌లైన్‌లో కత్తిని కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
ప్రధాన వీధుల్లో నిందితుల పరేడ్
అరెస్టు అనంతరం పోలీసులు ఇద్దరు నిందితులను శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా నడిపించుకుంటూ కోర్టుకు తరలించారు. స్వర్ణముఖి వంతెన నుంచి పెళ్లి మండపం వరకు చేతులకు బేడీలు వేసి నిందితులను నడిపించడంతో విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
ఆ తర్వాత నిందితులను పోలీసు వాహనంలో సత్యవేడు కోర్టుకు తరలించి హాజరుపరిచారు. విధుల్లో ఉన్న పోలీసుపై దాడికి ప్రయత్నించడం, కత్తితో బెదిరించడం వంటి ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు.

Post a Comment