సింగరేణి మారుపేర్లు బాధితుల ఆమరణ నిరాహార దీక్షకు సీఐటీయూ మద్దతు
సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద సింగరేణి మారుపేర్లు బాధితుల ఆమరణ నిరాహార దీక్షకు సీఐటీయూ మద్దతు
కొత్తగూడెం, ఆగస్టు 14: సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న ఆమరణ నిరాహార దీక్షకు సీఐటీయూ నాయకులు మద్దతు ప్రకటించారు. శుక్రవారం దీక్షా శిబిరానికి చేరుకున్న నాయకులు బాధితులను పరామర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా విజయగిరి శ్రీనివాస్ (కొత్తగూడెం బ్రాంచ్ సెక్రటరీ), మండ నర్సింహారావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వై. వెంకటేశ్వరరావు, మెండే శ్రీనివాస్, కే. రమేష్‌బాబు, గడాల నర్సింహారావు తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు.
ఎన్నికల హామీలను అమలు చేయాలి
సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
సమస్య పరిష్కారం అయ్యే వరకు బాధితులు వెనక్కి తగ్గబోరని, ఉద్యోగం వచ్చే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తారని నాయకులు తెలిపారు. ‘‘ఉద్యోగం వచ్చుడా.. సచ్చుడా..’’ అనే నినాదంతో బాధితులు ఆందోళన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
బాధితుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగకముందే ప్రభుత్వం స్పందించి వారితో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని సీఐటీయూ నాయకులు కోరారు.
లక్కా శ్రావణ్ గౌడ్ ఆధ్వర్యంలో దీక్ష
సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితుల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది.
దీక్షలో దనడా రాజు, కొల్లిపాక అన్వేష్, ఓం ప్రకాష్, సదానందం, షేక్ బాబర్, అశోక్, జక్కు శ్రావణ్, పిట్టల అనిల్ కుమార్, ఆకుల రవి, డిష్ బాబు, గిరి తదితర బాధితులు పాల్గొన్నారు.
మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని బాధితులు స్పష్టం చేశారు. తమ న్యాయపోరాటానికి కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు మద్దతు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.

Post a Comment