ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్ఎస్ మద్దతు
సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలు పరిష్కరించాలి
ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్ఎస్ మద్దతు దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్
కొత్తగూడెం: సింగరేణి సంస్థలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాధితులు కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం మారుపేర్లతో సింగరేణి సంస్థలో కొందరు ఉద్యోగాల్లో చేరారని, ప్రస్తుతం ఆ సమస్య కారణంగా ఉన్నత విద్యార్హతలు కలిగిన పలువురు అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బాధితుల సమస్యను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింగరేణిలో సుమారు 15 వేల కారుణ్య నియామకాలు చేపట్టామని, 3,200 పెండింగ్ ఉద్యోగాలను భర్తీ చేశామని, దాదాపు 5,500 ఎక్స్‌టర్నల్ ఉద్యోగాలు కల్పించామని రవీందర్ పేర్కొన్నారు.
భూపాలపల్లిలో జరిగిన సమావేశంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలను గెలిపిస్తే రెండు నెలల్లో మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. అలాగే యూనియన్ ఎన్నికల సమయంలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు కూడా అనేక హామీలు ఇచ్చాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతున్నా సింగరేణి కార్మికుల సమస్యల్లో ఏ ఒక్కదానికీ శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు.
మారుపేర్ల సమస్యతో పాటు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను తెరపైకి తీసుకువచ్చి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆబ్సెంటీజం కారణంగా ఏ ఒక్క సింగరేణి కార్మికుడినీ డిస్మిస్ చేయలేదని, గతంలో డిస్మిస్ అయిన సుమారు 800 మందికి తిరిగి ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని రవీందర్ పేర్కొన్నారు.
సింగరేణి సంస్థలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని ఆయన ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
పలువురు నాయకుల సంఘీభావం
దీక్షా శిబిరాన్ని సందర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, రాష్ట్ర నాయకులు హరిసింగ్ నాయక్, లక్కినేని సురేందర్, వగ్గెల పూజ, కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్లు తుమ్మ శ్రీనివాస్, గడప రాజయ్యతో పాటు కంచర్ల శ్రీనివాస్, ప్రసాద్, ఎంటెక్ మహేందర్, విద్యాసాగర్, వెంకటేశ్వర్లు, రాజేష్, రాములు, భాష తదితరులు దీక్షకు మద్దతు తెలిపారు.
ఆమరణ నిరాహార దీక్షలో మారుపేర్ల బాధితుల సంఘం అధ్యక్షుడు లక్క శ్రావణ్ గౌడ్‌తో పాటు దన్నాడ రాజు, ఓంప్రకాశ్, షేక్ బాబర్, పిట్టల అనిల్, సాయికిరణ్, అశోక్, కొల్లిపాక అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment