తల్లిదండ్రులు తమ సంతానానికి చక్కని చదువు, సంస్కారాలు నేర్పాలి: అబ్దుల్ బాసిత్

 

తల్లిదండ్రులు తమ సంతానానికి చక్కని చదువు, సంస్కారాలు నేర్పాలి: అబ్దుల్ బాసిత్

తల్లిదండ్రులు తమ సంతానానికి చక్కని చదువు, సంస్కారాలు నేర్పాలి: అబ్దుల్ బాసిత్

చుంచుపల్లి, ఆగస్టు 21: సంతానం దేవుడు ఇచ్చిన గొప్ప వరమని, తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించే గొప్ప ఆస్తి చక్కని విద్య, సంస్కారాలేనని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు.

పవిత్ర శుక్రవారం సందర్భంగా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మస్జిద్ ఎ ఖుబా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య అంటే కేవలం మార్కులు, ర్యాంకులు సాధించడం మాత్రమే కాదని, విద్యార్థులకు మంచి సంస్కారం, నైతిక విలువలు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు.

పెద్దల పట్ల, ముఖ్యంగా విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయుల పట్ల గౌరవం, వినయం కలిగి ఉండేలా పిల్లలను తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని సూచించారు. తల్లిదండ్రుల అతిగారాబం, అతి భోగలాలసలు పిల్లలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని, ఇటీవల నల్గొండ జిల్లాలో చోటుచేసుకున్న ప్రిన్సిపాల్ హత్య ఘటన ఇందుకు ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.

ఇకనైనా తల్లిదండ్రులు తమ పిల్లల దినచర్య, ప్రవర్తన, స్నేహాలు, చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ప్రభుత్వాలు సైతం పాఠశాలల్లో చిన్ననాటి నుంచే విద్యార్థులకు నైతిక విలువలు, మానవతా దృక్పథం, సామాజిక బాధ్యతలను తప్పనిసరిగా బోధించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మానవతా విలువలు, సామాజిక బాధ్యత లేని విద్యా విధానం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయడంతో పాటు సమాజంలో అనైతికత, హింస, అశాంతికి దారితీస్తోందని అబ్దుల్ బాసిత్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నైతిక విలువలతో కూడిన విద్యా విధానం కోసం మేధావులు, తల్లిదండ్రులు కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మసీదు అధ్యక్షుడు అజీజ్ ఖాన్, సోను భాయ్, షబ్బిర్, అన్వర్, ఖరీం, అజ్హర్, షమీం తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.