కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రద్దు కుట్రపై సమరశంఖం
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రద్దు కుట్రపై సమరశంఖం
కొత్తగూడెం, ఆగస్టు 17: పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సూచనలతో ఈ ఆందోళన చేపట్టారు.
మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పెండింగ్‌లో ఉన్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆరోపణలు
ధర్నాను ఉద్దేశించి కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ.. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రాజ్యాంగబద్ధతకు సంబంధించి హైకోర్టులో కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. కోర్టు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు పలుమార్లు అవకాశం ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం వెనుక పథకాలను రద్దు చేసే కుట్ర ఉందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఉన్న పథకాలను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆమె మండిపడ్డారు.
పెళ్లిళ్లు పూర్తయినా చెక్కుల కోసం ఎదురుచూపులు
లబ్ధిదారుల పరిస్థితి దయనీయంగా మారిందని కాపు సీతాలక్ష్మి అన్నారు. కొందరికి పెళ్లిళ్లు పూర్తయి, పిల్లలు పుట్టే పరిస్థితి వచ్చినా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందలేదని పేర్కొన్నారు. చెక్కుల కోసం లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమోదం పొందిన దరఖాస్తులకు వెంటనే చెక్కులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైకోర్టులో ప్రభుత్వం తరఫున సమర్థవంతమైన న్యాయవాదులతో వాదనలు వినిపించి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరాటంకంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పేదల హక్కులను కాలరాస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాపు సీతాలక్ష్మి స్పష్టం చేశారు.
ఎమ్మార్వోకు వినతిపత్రం
ధర్నాలో కార్పొరేటర్ సాగర్, మాజీ కౌన్సిలర్లు తోగూర్ రాజశేఖర్, అంబుల వేణు, కరాటే శ్రీను, సునీత, మాదాస్ పద్మ, అజీమా, ఈమంది గణేష్, ఎండీ ఖాజా బక్ష్, పూర్ణ, మునీర్, రిజ్వాన్ పాషా, శివ, షమ్మీ, బాబు, జానీ, అక్బర్, పిల్లి కుమార్, హైమద్, బి. శ్రీనివాస్, మనోజ్, వేణు, కనకయ్య, ఖాజా పాషా, అసద్, అమన్, సమీర్, షణ్ముఖ్, పాషా, షమ్మీ, సుందర్ పాసి తదితరులు పాల్గొన్నారు.
నిరసన అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న చెక్కులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తహసీల్దార్ డి. పుల్లయ్యకు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు.

Post a Comment