గ్రామీణ రహదారుల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం
గ్రామీణ రహదారుల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం
తెలంగాణలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ములుగు వేదికగా శుభారంభం పలికారు. ఈ సందర్భంగా ములుగులోని గట్టమ్మ ఆలయం ఎదురుగా పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు.
గ్రామ పంచాయతీలను మండల కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన రహదారులకు అనుసంధానం చేసేలా ఈ రహదారుల అభివృద్ధి చేపట్టనున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలకు గ్రామీణ ప్రజలు సులభంగా చేరుకునేందుకు ఈ రహదారులు కీలకంగా మారనున్నాయి.
ములుగును కేంద్రంగా చేసుకుని ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్రంలోని గ్రామీణ రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని అధికారులు తెలిపారు. గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.
ఈ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment