ఆటో డ్రైవర్ల బంద్‌కు తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు
ఆటో డ్రైవర్ల బంద్‌కు తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు
హైదరాబాద్: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు ఈ నెల 24 నుంచి చేపట్టనున్న బంద్‌కు తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శనివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్టీయూ)తో పాటు పలు ఆటో యూనియన్ల నాయకులతో కలిసి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆర్టీసీ యాజమాన్యానికి ఈవీ ఆటోలు అందించి లాస్ట్ మైల్ కనెక్టివిటీ సేవలను ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆటో నడుపుతున్న డ్రైవర్లతోనే లాస్ట్ మైల్ కనెక్టివిటీ సేవలను నిర్వహించాలని కోరారు.
ఆటో, ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు అనుగుణంగా ఆటో చార్జీలను పెంచాలని అన్నారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం స్వయంగా యాప్‌ను తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
శిశువు మృతికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కామారెడ్డి జీజీహెచ్‌లో శిశువు మృతి ఘటనపై ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.
ప్రసవం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఎక్కపల్లి తండాకు చెందిన గర్భిణికి సకాలంలో డెలివరీ చేయకపోవడం వల్లే శిశువు మృతి చెందిందని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు. శిశువును కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

Post a Comment