తమ్ముడికి రాఖీ కట్టి.. వెలకట్టలేని గిఫ్ట్ ఇచ్చిన అక్క
తమ్ముడికి రాఖీ కట్టి.. వెలకట్టలేని గిఫ్ట్ ఇచ్చిన అక్క
గ్రేటర్ నోయిడా: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుంది. అయితే గ్రేటర్ నోయిడాకు చెందిన బీనా తన తమ్ముడు జితేంద్రకు ఇచ్చిన రాఖీ కానుక మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది. తమ్ముడి ప్రాణాలను కాపాడేందుకు తన కిడ్నీని దానం చేసి అక్కాతమ్ముళ్ల బంధంలోని ప్రేమ, త్యాగానికి కొత్త అర్థాన్ని చాటిచెప్పింది.
గ్రేటర్ నోయిడాకు చెందిన జితేంద్ర గత రెండున్నరేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో తరచూ డయాలసిస్ చేయించుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ్ముడి పరిస్థితిని చూసిన ఆయన అక్క బీనా తీవ్రంగా చలించిపోయారు. తమ్ముడికి కొత్త జీవితం అందించాలనే సంకల్పంతో తన కిడ్నీని దానం చేసేందుకు ముందుకొచ్చారు.
రాఖీ పండుగ సందర్భంగా తమ్ముడి మణికట్టుకు రాఖీ కట్టిన బీనా.. తన కిడ్నీని దానం చేసి అతనికి వెలకట్టలేని బహుమతిని అందించారు. వైద్యుల పర్యవేక్షణలో కిడ్నీ మార్పిడి ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం. దీంతో జితేంద్రకు కొత్త జీవితం లభించింది.
తన నిర్ణయం గురించి బీనా మాట్లాడుతూ.. “ఇది త్యాగం కాదు.. అక్కగా నా బాధ్యత” అని చెప్పడం అందరినీ కదిలించింది. తమ్ముడి కోసం తన అవయవాన్ని దానం చేయడాన్ని ఆమె గొప్ప త్యాగంగా భావించకుండా, తన బాధ్యతగా పేర్కొనడం అక్కాతమ్ముళ్ల అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది.
మరోవైపు, తనకు ప్రాణం పోసిన అక్కకు జీవితాంతం రుణపడి ఉంటానంటూ జితేంద్ర భావోద్వేగానికి గురయ్యారు. “అక్క చేసిన మేలును ఏ జన్మలోనూ తీర్చుకోలేను” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
రాఖీ పండుగ రోజున సాధారణంగా ఇచ్చే బహుమతులకు భిన్నంగా.. తన జీవితాన్నే తమ్ముడికి కానుకగా ఇచ్చిన బీనా కథ సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమకు ఇది ఓ అపూర్వమైన ఉదాహరణగా పలువురు కొనియాడుతున్నారు.

Post a Comment