సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలపై కవిత డిమాండ్

 

సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలపై కవిత డిమాండ్

సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలపై కవిత డిమాండ్

డిపెండెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 2 వేల మంది అభ్యర్థులకు మెడికల్ బోర్డు నిర్వహించి, వారి దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి నెల మెడికల్ బోర్డు కొనసాగించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రక్షణ సేన, హెచ్ఎంఎస్ చేసిన డిమాండ్లకు గత నెల ప్రభుత్వం స్పందించిందని ఆమె తెలిపారు. అయితే కేవలం ఒక్క నెల మాత్రమే మెడికల్ బోర్డు నిర్వహించి, ఈ నెలలో ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ అవకాశం కల్పించే వరకు ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు.

అలియాస్ పేర్ల సమస్యను పరిష్కరించాలి

సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు రాకుండా ఇబ్బందులు కలిగిస్తున్న అలియాస్ పేర్ల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కవిత కోరారు. ఈ సమస్యపై నిరాహార దీక్ష చేస్తున్న యువమిత్రుల దీక్షను కూనంనేని సాంబశివరావు విరమింపజేయడంపై ఆమె ప్రశ్నలు సంధించారు.

ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కూనంనేని సాంబశివరావు.. అలియాస్ పేర్ల సమస్యపై దీక్ష చేస్తున్న యువమిత్రులకు ఏ హామీ ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వారికి రావాల్సిన ఉద్యోగాలు, హక్కులను కల్పిస్తారా? లేదా? అన్నది తేల్చి చెప్పాలని అన్నారు.

గతంలో అలియాస్ పేర్లకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో అన్ని యూనియన్లు అఫిడవిట్లు సమర్పించినప్పటికీ, కూనంనేని సాంబశివరావు మాత్రం అఫిడవిట్ ఇవ్వకుండా వెనక్కి తగ్గారని కవిత ఆరోపించారు. ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్న యువమిత్రుల దీక్షను విరమింపజేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

అలియాస్ పేర్లతో ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న యువమిత్రుల పోరాటానికి హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన మద్దతు ఉంటుందని కవిత ప్రకటించారు. వారి సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అదే విధంగా డిపెండెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరి ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.

Blogger ఆధారితం.