పాట ప్రజల హక్కుల పరిరక్షణకు గొంతుక కావాలి టీయుడబ్ల్యూజె అధ్యక్షులు కె. విరాహత్ అలీ
పాట ప్రజల హక్కుల పరిరక్షణకు గొంతుక కావాలి టీయుడబ్ల్యూజె అధ్యక్షులు కె. విరాహత్ అలీ
హైదరాబాద్, ఆగస్టు 19: పాట కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజాన్ని మేల్కొలిపే సాధనంగా, ప్రజల హక్కుల పరిరక్షణకు గొంతుకగా మారాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజె) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ అన్నారు.
"విశ్వజన కళామండలి" 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్‌లో నిర్వహించనున్న స్వర్ణోత్సవాల పోస్టర్‌ను మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విరాహత్ అలీ మాట్లాడుతూ విశ్వజన కళామండలి ప్రస్థానాన్ని కొనియాడారు.
యాభై ఏళ్ల క్రితం మాస్టార్జీ స్థాపించిన దళిత కళామండలి నేడు విశ్వజన కళామండలిగా రూపాంతరం చెంది దేశవ్యాప్తంగా విస్తరించడం అభినందనీయమన్నారు. మాస్టార్జీతో, సంస్థతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని తెలిపారు.
సమాజంలోని అణగారిన వర్గాల కష్టాలు, అవమానాలు, వివక్ష గురించి మాట్లాడటానికే అనేక ఆంక్షలు ఉన్న సమయంలో మాస్టార్జీ పాటను ప్రజల గొంతుకగా మలిచి పల్లెపల్లెనా సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించారని విరాహత్ అలీ గుర్తుచేశారు.
విశ్వజన కళామండలి కేవలం కళా సంస్థ మాత్రమే కాదని, దళితుల ఆత్మగౌరవానికి వేదికగా, సామాజిక న్యాయానికి గొంతుకగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రచార వేదికగా, అణగారిన ప్రజల చైతన్యానికి సాంస్కృతిక ఉద్యమంగా తన కార్యకలాపాలను కొనసాగించిందని ప్రశంసించారు.
మాస్టార్జీ రచించిన “అందుకో దండాలు... బాబా అంబేడ్కరా” గీతం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రజల్లో విశేష చైతన్యాన్ని కలిగించిందన్నారు. జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బుద్ధుడు, పెరియార్ వంటి సామాజిక సంస్కర్తల ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ విశ్వజన కళామండలి కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
కారంచేడు నుంచి చుండూరు వరకు దళితులపై జరిగిన అనేక దాడులపై కళామండలి స్పందించి, బాధితుల బాధ, ఆవేదన, ఆగ్రహాన్ని పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి సాంస్కృతిక పోరాటం నిర్వహించడం అభినందనీయమని విరాహత్ అలీ అన్నారు.
కార్యక్రమంలో విశ్వజన కళామండలి వ్యవస్థాపకులు మాస్టార్జీ, స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్ జే.బి. రాజు, విశ్వజన కళామండలి గౌరవ సలహాదారు తలకొక్కుల రాజు, బీసీ ఉద్యమ నాయకులు నారగోని వెంకటయ్య, దళిత ఉద్యమ నాయకులు నల్ల సూర్యప్రకాష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Post a Comment