రూ.50 వేల లంచం తీసుకుంటూ అటవీశాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు

 

రూ.50 వేల లంచం తీసుకుంటూ అటవీశాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు

ఏసీబీ మెరుపు దాడులు.. రూ.50 వేల లంచం తీసుకుంటూ అటవీశాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు

నాగర్‌కర్నూల్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. లింగాల అటవీశాఖ అధికారి కార్యాలయంలో ఈ దాడులు జరిగాయి.

వివరాల ప్రకారం.. నల్లమల అటవీ ప్రాంతం నుంచి కట్టెలను తరలిస్తున్న కొందరు వ్యక్తుల నుంచి అటవీశాఖ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాధితులు రూ.50 వేల నగదు చెల్లించినప్పటికీ, అధికారులు మరింత డబ్బు కావాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం.

అధికారుల వేధింపులు భరించలేక బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుపై రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో లింగాల అటవీశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. బాధితుల నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు దాడి చేసి అటవీశాఖ సిబ్బందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

ఏసీబీ అధికారులు లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, సంబంధిత అధికారులను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. అనంతరం కేసు నమోదు చేసి, పట్టుబడిన అధికారులను విచారిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది. అధికారిక ప్రకటన అనంతరం లంచం డిమాండ్ చేసిన అధికారులు ఎవరు, వారి హోదాలు ఏమిటి, ఎంత మొత్తాన్ని డిమాండ్ చేశారు అనే వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.