NH-44పై బ్లాక్‌స్పాట్‌ల పరిశీలన.. ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు వేగవంతం చేయాలని ఎస్పీ ఆదేశం
NH-44పై బ్లాక్‌స్పాట్‌ల పరిశీలన.. ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు వేగవంతం చేయాలని ఎస్పీ ఆదేశం
ఎన్‌హెచ్-44 జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న బంగారమ్మ టెంపుల్, కుచారం ప్రాంతాల్లోని బ్లాక్‌స్పాట్‌లను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదాలకు దారితీసే కారణాలను అధికారులు, సిబ్బందితో కలిసి సమగ్రంగా అధ్యయనం చేసి, వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జాతీయ రహదారులపై ప్రతి ప్రమాదాన్ని నివారించడం, ప్రతి ప్రాణాన్ని కాపాడడం పోలీసు శాఖతో పాటు అన్ని సంబంధిత శాఖల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారాల కోసం పోలీసు శాఖ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
బ్లాక్‌స్పాట్‌ల వద్ద హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ సైన్‌బోర్డులు, స్పీడ్ లిమిట్ సూచికలు, రోడ్ మార్కింగ్‌లు, క్యాట్‌ఐస్, స్ట్రీట్ లైటింగ్, క్రాష్ బ్యారియర్లు వంటి భద్రతా ఏర్పాట్లను అవసరమైన చోట వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే వాహనదారులు వేగ నియంత్రణ పాటించేలా చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో విజిబిలిటీ మెరుగుపడే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అదేవిధంగా, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ప్రమాదకర ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఎస్పీ సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు కారణమవుతుందని పేర్కొంటూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
"ప్రతి ప్రమాదాన్ని నివారించాలి... ప్రతి ప్రాణాన్ని కాపాడాలి" అనే లక్ష్యంతో పోలీసు శాఖ, NHAI సంయుక్తంగా చర్యలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించే దిశగా కృషి చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు.

Post a Comment