జనగణన హ్యాండ్‌బుక్‌ను అత్యంత ప్రామాణికంగా రూపొందించాలి: జనగణన సంచాలకులు భారతి హోళీ కేరి

 

జనగణన హ్యాండ్‌బుక్‌ను అత్యంత ప్రామాణికంగా రూపొందించాలి: జనగణన సంచాలకులు భారతి హోళీ కేరి

  జనగణన హ్యాండ్‌బుక్‌ను అత్యంత ప్రామాణికంగా రూపొందించాలి: జనగణన సంచాలకులు భారతి హోళీ కేరి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ (డీసీహెచ్‌బీ)ను అత్యంత ప్రామాణికంగా, ఖచ్చితమైన సమాచారంతో రూపొందించాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళీ కేరి జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీపై నిర్వహించిన రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో ఐడీఓసీ నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారతి హోళీ కేరి మాట్లాడుతూ, తెలంగాణలో తొలిసారిగా ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ హ్యాండ్‌బుక్‌లో జిల్లా జనాభా, సామాజిక, ఆర్థిక, పరిపాలనా, మౌలిక వసతులు, విద్య, వైద్యం, రవాణా తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా పొందుపరుస్తామని చెప్పారు.

సమాచార సేకరణలో డేటా నాణ్యత, ఖచ్చితత్వం, ఏకరూపతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అన్ని వివరాలను సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారిక రికార్డుల ఆధారంగా మాత్రమే సేకరించాలని, రెవెన్యూ గ్రామం నుంచి పట్టణ స్థాయి వరకు పూర్తి సమాచారాన్ని నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

జనగణన హ్యాండ్‌బుక్ తయారీకి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను కూడా వెల్లడించారు. ఆగస్టు 10 నుంచి 21 వరకు సమాచార సేకరణ, ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 8 వరకు డేటా నమోదు, పరస్పర పరిశీలన, సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేసి, నిర్ణీత గడువులోగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ను రాష్ట్ర జనగణన కార్యాలయానికి పంపించాలని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ మాట్లాడుతూ, రాష్ట్ర జనగణన సంచాలకులు ఇచ్చిన మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. అన్ని శాఖల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి, అధికారిక ఆధారాలతో సమాచారాన్ని సేకరించి, క్షుణ్ణంగా ధృవీకరించిన అనంతరం నిర్ణీత కాలపట్టిక ప్రకారం జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ను రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని పేర్కొన్నారు.

Blogger ఆధారితం.