సింగరేణి యాజమాన్యం ప్రతి నెల మూడు మెడికల్ బోర్డులు నిర్వహించాలి కాపు కృష్ణ
సింగరేణి యాజమాన్యం ప్రతి నెల మూడు మెడికల్ బోర్డులు నిర్వహించాలి కాపు కృష్ణ
అనారోగ్యంతో దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ 100 శాతం మెడికల్ అన్‌ఫిట్ చేయాలి: టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ
కొత్తగూడెం, సెప్టెంబర్ 1: సింగరేణి సంస్థలో అనారోగ్య సమస్యలతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికుల కోసం ప్రతి నెల క్రమం తప్పకుండా మూడు మెడికల్ బోర్డులు నిర్వహించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను నిబంధనల ప్రకారం 100 శాతం మెడికల్ అన్‌ఫిట్ చేయాలని కోరారు.
ఈ డిమాండ్ల సాధన కోసం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తగూడెం ఏరియాలో ఉద్యోగులు వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కాపు కృష్ణ మాట్లాడుతూ.. 1998లో సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేసిన నేపథ్యంలో, అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కారుణ్య నియామకాల విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా 14 వేల మందికి పైగా కార్మికులను మెడికల్ ఇన్‌వ్యాలిడేట్ చేయడం జరిగిందని, తద్వారా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది కార్మిక కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు.
అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మెడికల్ బోర్డుల నిర్వహణ, మెడికల్ అన్‌ఫిట్ శాతంపై కాంగ్రెస్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు తీవ్రంగా విమర్శలు చేశాయని కాపు కృష్ణ అన్నారు. నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తున్నారని, దరఖాస్తు చేసుకున్న వారిలో 80 శాతానికి పైగా కార్మికులను మెడికల్ అన్‌ఫిట్ చేయాలని డిమాండ్ చేస్తూ అప్పట్లో కార్మికుల ముందు హామీలు ఇచ్చారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తామని, ప్రతి నెల కనీసం మూడు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని హామీలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ఆ హామీలకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. దాదాపు 15 నెలల కాలంలో మెడికల్ బోర్డుల నిర్వహణ సక్రమంగా జరగలేదని, ప్రస్తుతం మెడికల్ అన్‌ఫిట్ అవుతున్న వారి శాతం 10కి మించడం లేదని పేర్కొన్నారు.
మెడికల్ బోర్డు ఎప్పుడు నిర్వహిస్తారోనని ఎదురుచూస్తూ అనేక మంది కార్మికుల సర్వీసు కాలం పూర్తవుతోందని కాపు కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులు, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇకనైనా మెడికల్ బోర్డులను నిరంతరాయంగా నిర్వహించాలని కోరారు.
మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న అర్హులైన కార్మికులందరినీ నిబంధనల ప్రకారం మెడికల్ ఇన్‌వ్యాలిడేట్ చేసి, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతరం టీబీజీకేఎస్ నాయకులు సంబంధిత మైన్ మేనేజర్లు, డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీలకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గడప రాజయ్య, కాగితపు విజయ్ కుమార్, బూర్గుల రవికుమార్, సంతోష్, నిశాంత్, నమిల్ల వెంకటేశ్వర్లు, అలీమ్ పాషా, వినీత్, అజీజ్, అజీమ్, బాలాజీ, అన్వర్ పాషా, నవీన్, శంకర్, వెంకట్రావు, అనుదీప్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment