ఏడుల్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి
ఏడుల్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి – గంజాయి వినియోగంపై ప్రత్యేక నిఘా
ఏడుల్ల బయ్యారం: ఏడుల్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌ను మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి తనిఖీ చేశారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన, పోలీసుల పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును సత్వరం స్వీకరించి, బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, సమస్య తీవ్రతను బట్టి వెంటనే స్పందించాలని ఆదేశించారు.
స్టేషన్‌లో నమోదైన పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు, నేరాలకు సంబంధించిన ఆధారాలను పకడ్బందీగా సేకరించాలని తెలిపారు.
ప్రాంతంలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎస్పీ ఆదేశించారు. యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై నిఘా పెంచాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అదేవిధంగా సీసీటీఎన్‌ఎస్ (CCTNS)లో కేసుల వివరాల అప్‌డేషన్‌ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, నిందితుల వివరాలు, అరెస్టులు, ఇతర సంబంధిత సమాచారాన్ని సకాలంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. పోలీస్ స్టేషన్ రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని, ఉన్నతాధికారుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ సూచించారు.
ప్రజలకు పోలీసులపై నమ్మకం మరింత పెరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు నిరంతరం కృషి చేయాలని రవీందర్ రెడ్డి సిబ్బందికి సూచించారు.

Post a Comment