మల్కాపూర్ ఫంక్షన్ హాల్ పూర్తి చేయాలి.. వెంకటాయపల్లికి విద్యుత్ సౌకర్యం కల్పించాలి
అసంపూర్తి అభివృద్ధి పనులపై సర్పంచ్‌ల గళం
మల్కాపూర్ ఫంక్షన్ హాల్ పూర్తి చేయాలి.. వెంకటాయపల్లికి విద్యుత్ సౌకర్యం కల్పించాలి
గుడిసెల్లో నివసించే అర్హులకు రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
అందుబాటులో లేని అధికారులపై ప్రజాప్రతినిధుల అసంతృప్తి
తూప్రాన్, సెప్టెంబర్ 23: తూప్రాన్ మండలంలోని గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కొరత, ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలపై సర్పంచ్‌లు గళమెత్తారు. ప్రజలకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
బుధవారం తూప్రాన్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం పలు సమస్యలపై చర్చలు, అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీసిన ఘటనలతో వాడివేడిగా సాగింది. జెడ్పీ సీఈవో, సమావేశం ప్రత్యేక అధికారి ఎల్లయ్య ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎంపీడీవో శాలిని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అసంపూర్తి ఫంక్షన్ హాల్‌ను పూర్తి చేయాలి
మల్కాపూర్ గ్రామంలో నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయిన ఫంక్షన్ హాల్‌ను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ కోరారు. భవనం పూర్తి కాకపోవడంతో గ్రామస్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సంబంధిత అధికారులు చొరవ తీసుకుని పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
వెంకటాయపల్లి గ్రామ పంచాయతీ భవనం కూడా అసంపూర్తిగా ఉండటంతో పాలకవర్గ సమావేశాలను ఆరుబయట నిర్వహించాల్సి వస్తోందని సర్పంచ్ హరీష్ గౌడ్ తెలిపారు. 16వ ఆర్థిక సంఘం నిధుల నుంచి నిధులు కేటాయించి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు.
వెంకటాయపల్లి బీసీ కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పించాలి
వెంకటాయపల్లి బీసీ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ హరీష్ గౌడ్ సభ దృష్టికి తీసుకువచ్చారు. కాలనీ వాసులు అంధకారంలో జీవించాల్సి వస్తోందని తెలిపారు. దీనిపై స్పందించిన ప్రత్యేక అధికారి ఎల్లయ్య విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గుడిసెల్లో నివసించే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
మల్కాపూర్, ఇస్లాంపూర్, వెంకటాయపల్లి గ్రామాల్లో గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన పేదలకు రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు కోరారు. ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై హౌసింగ్ డీఈ స్పందిస్తూ.. అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు గ్రౌండింగ్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హౌసింగ్ ఏఈ తీరుపై సర్పంచ్‌ల ఆగ్రహం
తూప్రాన్‌కు కొత్తగా వచ్చిన హౌసింగ్ ఏఈకి ఫోన్ చేసినా స్పందించడం లేదని, మాట్లాడే సమయంలో దురుసుగా వ్యవహరిస్తున్నారని వెంకటాయపల్లి సర్పంచ్ హరీష్ గౌడ్ ఆరోపించారు. దీంతో పలువురు సర్పంచ్‌లు స్పందిస్తూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే స్పందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొనగా, ప్రత్యేక అధికారి ఎల్లయ్య జోక్యం చేసుకుని సర్పంచ్‌లకు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
రైతులకు అందుబాటులో ఉండాలి
రైతులకు అందుబాటులో ఉండాల్సిన వ్యవసాయ అధికారులు స్పందించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇస్లాంపూర్ సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి తెలిపారు. ఫోన్ చేసినా స్పందించడం లేదని, రైతులకు అవసరమైన సమయంలో సరైన సమాచారం అందడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు.
మండల వ్యవసాయ అధికారి గంగమల్లు స్పందిస్తూ.. సహాయ వ్యవసాయ అధికారి భువనేశ్వరిని సరెండర్ చేసి, ఆమె స్థానంలో ఏఈఓ హరీష్‌ను తూప్రాన్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు. రైతులు అవసరమైన సమాచారం కోసం 9441684978 నంబర్‌లో సంప్రదించవచ్చని వెల్లడించారు.
పూల సాగు రైతులకు ఎకరాకు రూ.8 వేల సాయం
పూల తోటలు సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.8 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఉద్యానవన శాఖ అధికారి గోవింద్ తెలిపారు. పూల సాగుపై ఆసక్తి ఉన్న రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కలుపు నివారణకు ఉపయోగపడే రెండు రకాల యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఎఫ్‌టీఎల్ హద్దులపై వాగ్వాదం
మండలంలోని చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్ హద్దులను నిర్ణయించనున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ సుధీర్‌బాబు తెలిపారు. అయితే ఆక్రమణల తొలగింపునకు తమ శాఖకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారాలు లేవని, మేజిస్ట్రేట్ అధికారాలు కలిగిన రెవెన్యూ శాఖకు ఆ అధికారం ఉంటుందని వివరించారు.
దీనిపై మల్కాపూర్ సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఫ్‌టీఎల్ హద్దులు నిర్ణయించిన తర్వాత ఆక్రమణలపై చర్యలు తీసుకునే అధికారం లేకపోతే నీటిపారుదల శాఖ పాత్ర ఏమిటని ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు సభలో వాగ్వాదం, గందరగోళం నెలకొనగా ప్రత్యేక అధికారి ఎల్లయ్య జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
యూనిఫాంలు, షూస్ పంపిణీకి సిద్ధం
విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాంలు, షూస్ పంపిణీలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ ప్రస్తుతం పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ పర్వతి సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సమావేశం నుంచి అధికారులు వెళ్లిపోవడంపై అసంతృప్తి
మండల సర్వసభ్య సమావేశం కొనసాగుతున్న సమయంలో వ్యవసాయ, ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన ఏఈలు తమ శాఖల అంశాలను వివరించిన అనంతరం సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో పలు సమస్యలపై చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు నిర్వహించే సమావేశాలకు సంబంధిత శాఖల అధికారులు పూర్తిస్థాయిలో హాజరై, ప్రజాప్రతినిధులు లేవనెత్తే సమస్యలకు సమాధానాలు ఇవ్వాలని వారు కోరారు.
సమావేశంలో జెడ్పీ సీఈవో, ప్రత్యేక అధికారి ఎల్లయ్య, ఎంపీడీవో శాలిని, మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ పర్వతి సత్యనారాయణ, పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ లింగమూర్తి, వ్యవసాయ అధికారి గంగమల్లు, ఎక్సైజ్ ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్‌లు గొల్లపల్లి సంతోష్ రెడ్డి, పంజాల ఆంజనేయులు గౌడ్, హరీష్ గౌడ్, చింతల జయరాములు, చుక్క హిమబిందు శ్రీశైలం, బక్క స్వరూప నవీన్ గౌడ్, భాగ్యలక్ష్మి, శ్రీలత శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment