సింగరేణి భవన్ ముందు బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ ధర్నా

 

విద్యుత్‌ సరఫరాకు నాణ్యమైన బొగ్గు ఇవ్వాలి.. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సింగరేణి భవన్ ముందు బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ ధర్నా

విద్యుత్‌ సరఫరాకు నాణ్యమైన బొగ్గు ఇవ్వాలి.. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సింగరేణి యాజమాన్యానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా సింగరేణి నుంచి నాణ్యమైన బొగ్గు సరఫరాను పెంచాలని, సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, టీబీజీకేఎస్‌ నాయకులు హాజరయ్యారు. “చలో సింగరేణి భవన్” కార్యక్రమంలో భాగంగా సింగరేణి భవన్‌ ముందు నిరసన చేపట్టిన నాయకులు.. అనంతరం సింగరేణి డైరెక్టర్‌ ఆపరేషన్స్‌తో చర్చలు జరిపి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ప్రధాన డిమాండ్లు

  • సింగరేణిలో నిర్వహించే మెడికల్‌ బోర్డులను నెలకు మూడు సార్లు నిర్వహించి, అర్హులైన కార్మికులను 100 శాతం అన్‌ఫిట్‌ చేయాలి. వైద్యపరమైన సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి.
  • కార్మికులపై ఆర్థిక భారంగా మారిన పేర్స్‌పై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ మాఫీకి తగిన చర్యలు తీసుకోవాలి.
  • సింగరేణి సంస్థకు జెన్‌కో నుంచి రావాల్సిన రూ.67 వేల కోట్ల బకాయిలను వెంటనే వసూలు చేసి సంస్థకు చెల్లించాలి.
  • సెప్టెంబర్‌ 9తో ప్రస్తుత గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగిసినందున సింగరేణిలో వెంటనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలి.
  • కార్మికుల భద్రత, సంక్షేమం, సంస్థ పట్ల వారి అంకితభావాన్ని దృష్టిలో ఉంచుకుని న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి అమలు చేయాలి.
  • రాష్ట్ర విద్యుత్‌ అవసరాల దృష్ట్యా జెన్‌కో సంస్థలకు అవసరమైన మేరకు నాణ్యమైన బొగ్గు సరఫరాను పెంచాలి.

విద్యుత్‌ సమస్యలపై ఆందోళన

రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లేకపోవడం వల్ల రైతులు, పారిశ్రామిక రంగం, వ్యాపారులు, ఇతర వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్‌ అంతరాయం లేకుండా ఉండేందుకు జెన్‌కో సంస్థలకు అవసరమైన మేరకు నాణ్యమైన బొగ్గును సింగరేణి సరఫరా చేయాలని కోరారు.

కార్మికుల సంక్షేమం, సింగరేణి సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి పెంపు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను సమన్వయం చేస్తూ తమ డిమాండ్లపై సింగరేణి యాజమాన్యం, సంబంధిత ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్‌, అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి, రాష్ట్ర చీఫ్‌ జనరల్‌ సెక్రటరీ కాపు కృష్ణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కూసాని వీరభద్రం, కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులు గడప రాజయ్య, కొత్తగూడెం కార్పొరేట్‌ ఉపాధ్యక్షులు తుమ్మ శ్రీనివాసరావు, సెంట్రల్‌ కమిటీ నాయకులు కిరణ్‌ కుమార్‌, గిన్నారపు మహేందర్‌, సురేష్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.