అడవి భూమిలోకి అనుమతి లేదంటూ గిరిజనులను అడ్డుకున్న అటవీ అధికారులు
అడవి భూమిలోకి అనుమతి లేదంటూ గిరిజనులను అడ్డుకున్న అటవీ అధికారులు
అటవీ సిబ్బంది దాడి చేశారని గిరిజనుల ఆరోపణ.. బాధితుడిని ఆసుపత్రికి తరలింపు
కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొత్తపల్లి రాజారాం ప్రాంతంలో అటవీ భూముల విషయంలో గిరిజనులు, అటవీ శాఖ సిబ్బంది మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. అడవి భూముల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ అటవీ శాఖ అధికారులు రైతులను అడ్డుకున్నట్లు సమాచారం.
కొత్తపల్లి రాజారాం ప్రాంతానికి చెందిన కొందరు గిరిజనులు అటవీ భూముల్లో పట్టు పురుగుల పెంపకం (సెరికల్చర్) సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయా భూముల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన గిరిజనులను అటవీ శాఖ సిబ్బంది అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు స్థానికులు తెలిపారు.
ఈ క్రమంలో గిరిజనుడైన చింతల లస్మయ్యపై అటవీ శాఖ సిబ్బంది దాడి చేశారని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. దాడి ఘటనలో లస్మయ్య స్పృహ కోల్పోయి పడిపోయారని, అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు, స్థానికులు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లోకి వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం సరికాదని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సాగు హక్కులను పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు.
అటవీ సిబ్బంది దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇరువర్గాల వాదనలు వెలుగులోకి వచ్చిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Post a Comment