తెలంగాణ రక్షణ సేనలోకి నిర్మల్ బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు
తెలంగాణ రక్షణ సేనలోకి నిర్మల్ బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు
ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు, నాయకుల చేరిక
హైదరాబాద్: నిర్మల్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సుంచు ఎల్లయ్యతో పాటు ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, వివిధ సామాజిక సంఘాల ప్రముఖులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన సర్పంచులు టేకం లక్ష్మణ్, గడ్డం భీముడు, కె. రాజేందర్, కస్తూరి అర్జున్, శ్రీపెల్లి శేఖర్, ఉప సర్పంచులు పి. రాజు, చింటు కాంతి, గంపల భూమన్న, మాజీ ఎంపీటీసీ సభ్యులు రామ్‌సింగ్, షిండే సదాశివ, మాజీ సర్పంచులు ఎ. శంకర్, నాయకపోడ్ తదితరులు టీఆర్ఎస్‌లో చేరారు. అలాగే కోలం, నాయకపోడ్ సంఘాలకు చెందిన పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నిర్మల్ జిల్లాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె పేర్కొన్నారు.
అలాగే ఈ నెలలో ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కవిత పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో ప్రజలను సభకు తరలించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. తాజా చేరికలతో ఖానాపూర్ నియోజకవర్గంలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.

Post a Comment