ట్రాఫిక్ చలానా పేరుతో సైబర్ మోసం.. రూ. 1.36లక్షలు మాయం
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలేలో ఘటన, గుంటూరు జిల్లాలో మరోసారి సైబర్ మోసగాళ్ల కొత్త పన్నాగం బయటపడింది. ట్రాఫిక్ చలానా పేరుతో ఒక వ్యక్తిని బోల్తా కొట్టించి దుండగులు ఏకంగా రూ.1.36 లక్షలు కాజేశారు.
వివరాల్లోకి వెళ్తే.. వీర్లపాలే గ్రామానికి చెందిన నిరంజన్ రెడ్డి హోటల్ నిర్వహిస్తున్నారు. ఆయన మొబైల్‌కు శుక్రవారం రాత్రి “ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మీ వాహనంపై చలానా ఉంది, వెంటనే చెల్లించాలి” అంటూ రాష్ట్ర పోలీసుల పేరుతో ఏపీకే ఫైల్‌లో మెసేజ్ వచ్చింది.
పూర్తి సమాచారం కోసం ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయగానే ఓ యాప్ డౌన్‌లోడ్ అయింది. దానిని ఓపెన్ చేయగా ఓటీపీ అడిగింది. అనుమానం వచ్చిన నిరంజన్ రెడ్డి ప్రక్రియను అర్థాంతరంగా ఆపేశారు.
అయినా శనివారం ఉదయం ఆయన క్రెడిట్ కార్డు నుంచి వరుసగా రూ.61,000 – రూ.32,000 – రూ.20,999 చొప్పున మొత్తం రూ.1.36 లక్షలు డెబిట్ అయినట్లు సందేశాలు వచ్చాయి. ఆ డబ్బుతో ఆన్‌లైన్‌లో మొబైళ్లు కొనుగోలు చేసినట్లు కూడా నోటిఫికేషన్లు అందాయి.
దాంతో నిరంజన్ రెడ్డి అప్రమత్తమై వెంటనే కార్డును బ్లాక్ చేయించుకున్నారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఈ మోసానికి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి పాల్పడినట్లు గుర్తించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
Post a Comment