డేంజర్లో పోచారం ప్రాజెక్టు.. భయాందోళనలో 14 గ్రామాలు
కామారెడ్డి, ఆగస్టు 27 : కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండిపోగా వాగులు, వంకలు నదుల మాదిరిగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వరదల ప్రభావం నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టుపై పడింది.
ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోవడంతో అన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ, భారీ ఎత్తున నీరు చేరుతుండటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. ప్రాజెక్టు పై నుంచి వరద నీరు దూకిపడటం స్థానికులను మరింత భయాందోళనకు గురి చేస్తోంది.
అధికారుల సమాచారం ప్రకారం, బుధవారం ఒక్కరోజే 1.15 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరింది. పూర్తి నీటిమట్టం 1.82 టీయంసీలు కాగా, అది ఇప్పటికే దాటిపోయింది. దీంతో ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద బుంగలు ఏర్పడి, ఏ క్షణమైనా ప్రమాదం సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు పరిధిలోని 14 గ్రామాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఏవైనా అనుకోని ఘటనలు జరగకముందే, ప్రభావిత గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు.
ప్రాజెక్టు వద్ద ఏర్పడిన ఆందోళనకర పరిస్థితుల వల్ల గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత విషమించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Post a Comment