మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు – రూ.150 కోట్లు మంజూరు
భూపాలపల్లి: జనవరి 28 నుంచి 31 వరకు జరగబోయే సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర విజయవంతం కావడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు ప్రారంభించింది. జాతర కోసం ప్రత్యేకంగా రూ.150 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు.
జంపన్న వాగు నుంచి ఊరి వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టినట్టు ఆమె తెలిపారు. అలాగే 29 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేయబోతున్నట్టు సీతక్క పేర్కొన్నారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె వివరించారు.
అధికారుల సమన్వయంతో రవాణా, తాగునీరు, వసతి, వైద్య శిబిరాలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నట్టు సమాచారం. ఆదివాసీ ఆరాధన పండుగ అయిన మేడారం జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది.

Post a Comment