పూజ పేరుతో 6లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి తమ మోసపూరిత పద్ధతులతో పాతబస్తీ పురానాపూల్‌కు చెందిన ఓ పురోహితుడిని బలితీసుకున్నారు. పూజ పేరుతో నమ్మించి ఆయన ఖాతా నుంచి సుమారు 6లక్షల రూపాయలు కాజేశారు.
వివరాల్లోకి వెళితే—సికింద్రాబాద్ మిలటరీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన నిందితులు, “కల్నల్ సర్ ఆరోగ్యం బాగాలేదు. 11 రోజులు పూజ చేయించడానికి 21మంది పురోహితులు కావాలి” అంటూ బాధితుడిని నమ్మించారు. అడ్వాన్స్‌గా 3లక్షలు పంపుతామని చెప్పి, తొలుత 10రూపాయలు గూగుల్ పే ద్వారా పంపారు. ఆపై వీడియో కాల్ ద్వారా మిగతా డబ్బులు కూడా పంపుతామని నమ్మబలికి, బాధితుడి క్రెడిట్ కార్డు, పిన్ నంబర్ వివరాలు తీసుకున్నారు.
ఈ క్రమంలో విడతలవారీగా మొత్తం 5.99లక్షలు ఖాతా నుంచి మాయమయ్యాయి. చివరకు మోసపోయానని గ్రహించిన పురోహితుడు వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, నిందితులను గుర్తించి పట్టుకునే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అవగాహన లేకుండా ఎవరి సూచనలకో, నమ్మకానికో వ్యక్తిగత బ్యాంకు వివరాలు ఇవ్వవద్దని సైబర్ క్రైమ్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Post a Comment