కుక్కల దాడిలో ఆరుగురికి గాయాలు తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం వీధి కుక్కలు అదుపు తప్పి స్థానికులపై దాడి చేశాయి. ఒక్కసారిగా దాడి జరగడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సి.హెచ్.సి సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్ పర్యవేక్షణలో గాయపడిన వారికి చికిత్స అందుతుంది. గాయాలు ప్రాణాపాయం కలిగించే స్థాయిలో లేవని, అందరికీ అవసరమైన ఇంజెక్షన్లు, మందులు వేసినట్టు ఆయన తెలిపారు. కొద్ది రోజుల్లో రోగులు పూర్తిగా కోలుకుంటారని వైద్యులు ధైర్యం చెప్పారు.
ఈ ఘటనతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మాసాయిపేటలో రోజురోజుకీ పెరుగుతున్న వీధి కుక్కల సంఖ్యను నియంత్రించకపోతే ఇలాంటి సంఘటనలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Post a Comment