కోస్తాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

కోస్తాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ప్రభావం చూపనుంది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద కేంద్రీకృతమైన ఈ వాయుగుండం మంగళవారం మధ్యాహ్నం ఒడిశా – ఉత్తర కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది ఒడిశా రాష్ట్రంలోని గోపాల్‌పూర్‌కి దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై, వాయవ్య దిశగా కదులుతోంది.

తీరం వెంబడి బలమైన గాలులు

వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం ఆగ్రహంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దని అధికారాలు హెచ్చరికలు జారీ చేశాయి.

భారీ వర్షాల సూచన

ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు, మిగిలిన కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఇవాళ సెలవు ప్రకటించారు.

వరద ఉధృతి పెరుగుతున్న నాగావళి

నాగావళి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

కంట్రోల్ రూమ్ నంబర్: 08942-240557

ప్రభుత్వ యంత్రాంగం కదిలింది

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన సాయ సహాయాలు అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.