బహుజనుల అభివృద్ధికి విద్యే ఆయుధం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, “సమాజంలో బహుజనులు ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గం” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మహనీయుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
సీఎం మాట్లాడుతూ,
- బహుజనులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
- సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని సచివాలయం ఎదుట ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించడం, ఆయన నిర్మించిన ఖిలాషాపూర్ కోటను చారిత్రక క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం జరుగుతోందని చెప్పారు.
- బహుజనులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో కుల గణన పూర్తి చేసి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులు రాష్ట్రపతికి పంపించామని తెలిపారు.
“కుల గణనలో ఎలాంటి లోపం లేదు. 95 వేల మంది ఎన్యుమరేటర్లు రెండు నెలల పాటు ఇంటింటికీ తిరిగి సేకరించిన సమాచారాన్ని కంప్యూటరైజ్ చేశాం. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు ఎక్కడా తావు లేదు. వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు ఇచ్చాం” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అలాగే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల గరిష్ట పరిమితిని పెంచేందుకు ఆర్డినెన్స్ కూడా జారీ చేశామని తెలిపారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆందోళన కూడా చేశామని గుర్తు చేశారు.
“ప్రస్తుత పరిస్థితుల్లో బహుజనులు చదువుకోవడం ద్వారానే తలరాత మార్చుకోగలరు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే చదువే మార్గం” అని ముఖ్యమంత్రి హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారులు కే. కేశవరావు, వేంనరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment