వర్ష బీభత్సం.. బీబీపేట-కామారెడ్డి మార్గంలో కొట్టుకుపోయిన వంతెన
కామారెడ్డి, ఆగస్టు 28: కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కుంభవృష్టి ధాటికి గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా రహదారులు దెబ్బతిన్నాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ రహదారి నెట్‌వర్క్‌పై వర్షం తీవ్ర ప్రభావం చూపింది. బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే ప్రధాన మార్గంలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర సేవలు, సరుకు రవాణా తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నాయి.
ఇక క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై వరద తీవ్రతకు భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీనితో నిజామాబాద్ వైపు వెళ్ళే వాహనాల రాకపోకలు నిలిచిపోయి వందలాది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. డ్రైవర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం పలు ప్రాంతాల్లో రెవెన్యూ, రోడ్లు-భవనాలు శాఖలు పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. వర్షం మరికొన్ని రోజులు కొనసాగనుందనే వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

Post a Comment