కామారెడ్డి జిల్లా వరద పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటన
కామారెడ్డి జిల్లా: ఆగస్టు 28 : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాల ప్రభావం కామారెడ్డి జిల్లాపై తీవ్రంగా పడింది. వరద పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర మంత్రి సీతక్క నేడు జిల్లాలో పర్యటించారు. ఆమె వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఉన్నారు.
మంత్రి సీతక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు. అవసరమైన సహాయక చర్యలు అందుతున్నాయా అనే అంశంపై స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. “ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎవరూ ఆందోళన చెందవద్దు” అని భరోసా కలిపించారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి మంత్రి సీతక్క పలు సూచనలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నదే ప్రాధాన్యతగా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే పలు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, వందలాది కుటుంబాలను తరలించినట్లు అధికారులు తెలిపారు.
వరద బీభత్సం కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలకు తక్షణ సహాయం అందేలా SDRF, NDRF, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దింపబడ్డారు. మొత్తం జిల్లా యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
ప్రజలు తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొన్నా, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన మంత్రి సీతక్క, “ప్రజలు ధైర్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తోడుగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు.

Post a Comment